నవరసాల్లో శృంగార రసం, హాస్య రసం చాలా గొప్పవంటారు. అయితే ఈ రెండింటిలోనూ శృంగార రసం మరింత గొప్పదంటారు మహానటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు. ఒకసారి శృంగార, హాస్య రసాల్లో ఏది గొప్పదనే వాదన వచ్చినప్పుడు "హాస్యరసం చాలా మంచిది. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ నుంచి రిలీవ్ కావాలంటే హాస్యరసం కావాలి." అని చెప్తూనే, ఒక సంఘటన పంచుకున్నారు. అక్కినేనికి మార్నింగ్ వాక్ తర్వాత కిచెన్ గార్డెన్‌లో కొంచెంసేపు పనిచెయ్యడం అలవాటు. అలా పనిచేస్తుండగా ఒకచోట ఒక కప్ప కనిపించింది. దాన్ని తొలగించి, అక్కడ శుభ్రం చెయ్యాలనుకున్నారు.
అది కదల్లేదు. ఒక పుల్ల తీసుకువచ్చి, దాన్ని పొడిచారు. అయినా అది కదల్లేదు. గట్టిగా ఉన్న ఆకులాంటిది తీసుకువచ్చి, దాన్ని తీసేశారు. "అప్పుడేమైందంటే.. ఆ కప్పకింద అప్పుడే ప్రసవించిందో, పెట్టిందో.. దాని చిన్నపిల్లలు.. కప్పపిల్లలు కనిపించాయి. వాటిని చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దీన్ని ఎంత డిస్ట్రబ్ చేశాను నేను. ఆ తల్లిప్రేమ ఎలాంటిది. అయ్యయ్యో.. నేనెంత పొరపాటు పని చేశాను. అని బాధపడ్డాను. ఆ వెంటనే తెలియకుండా చేస్తే తప్పులేదు కదా అని సరిపెట్టుకున్నాను." అని చెప్పారు. అప్పుడాయన అనుభవించింది కరుణరసం.
"కానీ ఆ తల్లిప్రేమ ఉండటానికి కారణం, ఆ ప్రేమ ఉద్భవించడానికి కారణం, ఆ పిల్లలు పుట్టడానికి కారణం శృంగార రసమా.. హాస్య రసమా.. చెప్పండి. అందుచేత ఫస్ట్ మార్క్ ఎన్నటికీ శృంగారానికే. హ్యాట్సాఫ్ టు రొమాన్స్. దటీజ్ లవ్." అని చెప్పారు అక్కినేని. అందుకే కాబోలు తెరపై శృంగార రసాన్ని అద్భుతంగా ఆయన ఆవిష్కరించేవారు.
నేడు అక్కినేని వర్థంతి